అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దొంగ వాగ్ధానాలు చేసే కాంగ్రెస్‌ పార్టీని కాదు.. కష్టపడి పనిచేసే బీజేపీ ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కోరారు. కమ్మర్‌పల్లి మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. మన ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలంటే ముందుచూపుతో నిరంతరం పనిచేసే వారు కావాలన్నారు. ఇక్కడ మక్క, వరి, చెరుకు, మామిడి, డ్రైఫ్రూట్‌ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. దీంతో కుటుంబాలను వదిలి గల్ఫ్‌కు వెళ్లి పనిచేస్తున్న కార్మికులు తిరిగి సొంత ఊరికి వస్తారన్నారు. 50 ఏళ్ల క్రితం గుజరాత్‌లో అభివృద్ధి లేకపోవడంతో వారు మన ప్రాంతానికి వచ్చి బతికేవారని.. కానీ నరేంద్ర మోదీ హయాంలో ఆ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 120 దేశాలు అక్కడ పెట్టుబడులు పెట్టాయని వివరించారు. మోదీ పాలనలో భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానం నుంచి ఐదో స్థానానికి ఎదిగిందన్నారు. భవిష్యత్తు మూడోస్థానానికి చేరుతుందన్నారు.

జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభం చేయిస్తా

జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు పనులు ఏళ్లు గడుస్తున్నా ఎందుకు ప్రారంభం కాలేదని అర్వింద్‌ ప్రశ్నించారు. తాను మళ్లీ గెలవగానే వచ్చే ఏడాది పనులు ప్రారంభింపజేస్తానని ప్రకటించారు. అలాగే డ్రైపోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. పనిపైనే దృష్టి పెట్టాలని.. పైసలపై కాదని వ్యాఖ్యానించారు. నిరంతరం పనిచేయాలని.. అవినీతి లేకుండా పనులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ పనులన్నీ బీజేపీతోనే సాధ్యమవుతాయని చెప్పారు. అభివృద్ధి చేసినప్పుడే ప్రజల మనస్సులో నిలిచిపోతామని పేర్కొన్నారు. పనులు చేయకపోతే ప్రధాని మోదీ సైతం మాకు టికెట్లు ఇవ్వబోరన్నారు. ఇలా బీజేపీ కష్టపడి పనిచేస్తుందని వివరించారు. కానీ కాంగ్రెస్‌ నేతలు ఎన్నికలు రాగానే దొంగ వాగ్ధానాలు చేసి.. ఎలక్షన్స్ అయిపోగానే మళ్లీ కనిపించకుండా పోతారన్నారు. జీవన్‌రెడ్డి 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలకు చేసిన మేలు ఏమీలేదన్నారు. హిందువులకు పౌరసత్వం ఇస్తే ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ నుంచి వచ్చిన రోహింగ్యా ముస్లింలకు పౌరసత్వం ఇవ్వాలంటున్నారన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, యూసీసీపై అభిప్రాయం చెప్పలేని వ్యక్తి జీవన్‌రెడ్డి అని విమర్శించారు. ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతుండడంతో ట్రిపుల్‌ తలాక్‌ చట్టాన్ని మోదీ ఎత్తేశారని వివరించారు. దీనిపై ముస్లిం మహిళలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. యూసీసీ వస్తే ముస్లిం మహిళలకే ఉపయోగమన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు దేశానికి ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిరం పూర్తయ్యిందని.. మధురలో కృష్ణ మందిరం కూడా నిర్మించాలన్నారు. రామమందిరం నిర్మించి, పసుపుబోర్డు ప్రకటించిన ప్రధాని మోదీని ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.