అక్షరటుడే ఇందూరు: ఉగ్రవాద సంస్థలకు కాంగ్రెస్‌ మాతృ సంస్థగా మారిందని ఎంపీ ధర్మపురి అరవింద్‌ ధ్వజమెత్తారు. దేశంలో నిషేధింపబడిన స్టూడెంట్‌ ఇస్లామిక్‌ మూమెంట్‌ సంస్థ కాంగ్రెస్‌కు ఓటేయాలని కరపత్రాలు పంచడమే ఇందుకు నిదర్శనమన్నారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐసిస్‌, ఇతర తీవ్రవాద సంస్థలతో సంబంధం ఉందన్న కారణంతో ఇస్లామిక్‌ మూమెంట్‌ సంస్థను నిషేధించారన్నారు. దేశంలో జరిగిన మత కలహాలు, బాంబ్‌ బ్లాస్ట్‌లతో దానికి సంబంధం ఉందని తేలిందన్నారు. ఇలాంటి సంస్థ కాంగ్రెస్‌ కు సపోర్ట్‌ చేస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. రానురాను కాంగ్రెస్‌ టెర్రరిస్టులకు మాతృ సంస్థగా మారుతుందని విమర్శించారు. చివరికి దుబాయ్‌లో ఉన్న సున్ని సంస్థ కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చిందన్నారు. జగిత్యాల పీఎఫ్‌ఐకి.. బోధన్‌ నకిలీ పాస్ పోర్టులకు అడ్డాగా మారాయన్నారు. వీటిపై రేవంత్‌ రెడ్డి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒకవేళ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దేశం టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్లిపోతుందన్నారు. ఈ ఎన్నికలు హిందువుల ఉనికి కాపాడేవని పునరుద్ఘాటించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులాచారి, న్యాలం రాజు, ఫ్లో రీడర్‌ స్రవంతి రెడ్డి కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.