అక్షరటుడే, వెబ్ డెస్క్: కేసీఆర్ మాదిరిగానే సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలన చేస్తున్నారని ఎంపీ అరవింద్ ధర్మపురి మండిపడ్డారు. అబద్ధపు హామీలతో రాష్ట్ర రైతులు, మహిళలను మోసం చేశారని ధ్వజమెత్తారు. మంగళవారం డొంకేశ్వర్ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, వాటిని అమలు చేయడం చేతగాక దేవుళ్లపై ఒట్టు వేస్తున్నారని విమర్శించారు. అవసరమైతే రేవంత్ ను బొక్కలో వేసి అయినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయిస్తామన్నారు. బీజేపీ ఒకసారి మాట ఇస్తే తప్పదని, ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కేవలం బోర్డు ఏర్పాటు మాత్రమే కాదని.. పరిశ్రమలు సైతం ఏర్పాటు కావాలన్నారు. అప్పుడే పసుపు రైతులకు శాశ్వతంగా మంచి రోజులు వస్తాయన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నందునే వరికి ఎంఎస్పీ అందుతోందని చెప్పారు. రైతాంగం ఎప్పటికీ బాగుండాలంటే నరేంద్ర మోదీ పాలన అవసరమన్నారు. రాష్ట్రంలో అబద్ధపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పటి వరకు తులం బంగారం, రూ.500 బోనస్, రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయలేదని మండిపడ్డారు. పైగా బీజేపీపై దొంగ ప్రచారాలు చేస్తున్నారని, ఢిల్లీ పోలీసులు రాగానే రేవంత్ కనిపించకుండా పోయారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి శత్రువులు ఎక్కడో లేరని, సొంత పార్టీ నేతలే ఆయన్ను జైలుకు పంపేలా దొంగ వీడియోలు చేపిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా సీఎం అబద్ధపు ప్రచారాలు పక్కనపెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని హితవు పలికారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.