అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తూ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించనున్నామని రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేయకుండా నామమాత్రంగా రాష్ట్ర అవరతరణ ఉత్సవాలను నిర్వహించేవారని విమర్శించారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్యూడల్‌ వ్యవస్థలా బీఆర్‌ఎస్‌ పాలన సాగిందని.. వారి హయాంలో తెలంగాణ అమరులను, రాష్ట్ర సాధన కోసం పనిచేసిన వారిని విస్మరించారన్నారు. పదేళ్ల కాలంలో పేపర్ల లీకేజీలు, లిక్కర్‌ స్కాంలే తప్ప ప్రజలకు చేసిన మేలు ఏమీలేదని విమర్శించారు. రైతులకు అన్ని విధాలా అన్యాయం చేశారని.. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వరికి రూ.500 బోనస్‌ ఇవ్వనుందని పేర్కొన్నారు. అలాగే రుణమాఫీ కూడా చేయనున్నామని తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ, ట్రిబుల్‌ ఐటీ, మెడికల్‌ కాలేజీలు ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని గుర్తు చేశారు. చార్మినార్‌ దేనికి కట్టారో కూడా తెలియకుండా కేటీఆర్‌ డ్రామాకు తెరలేపారన్నారు. తెలంగాణ ప్రభుత్వ చిహ్నంలో రాచరిక పోకడలు లేకుండా చేసేందుకు మాత్రమే రేవంత్‌ రెడ్డి పనిచేస్తుంటే.. దీన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తామని.. ఇందుకోసం అసెంబ్లీలో చర్చిస్తామని తెలిపారు. అందరి అభిప్రాయాలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నగర అధ్యక్షుడు కేశ వేణు, గడుగు గంగాధర్, శేఖర్ గౌడ్, విపుల్ గౌడ్, వేణు రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  CM Revanth reddy | బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్​ రెడ్డి ఫైర్‌..