అక్షరటుడే, ఇందూరు: ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం డిక్లరేషన్‌ల పేరుతో యువతను మోసం చేసిందని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ యూత్‌ డిక్లరేషన్‌ పేరుతో తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో ప్రాణాలర్పించిన కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి మోసం చేసిందన్నారు. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, గౌరవ పెన్షన్‌ ఇస్తామని మరిచిపోయారన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి సెప్టెంబర్‌ 17లోపు నియామకాలు చేపడతామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. 2 లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ ఊసే లేదని పేర్కొన్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ పేరుతో కుల గణన, బీసీ కమిషన్‌ నివేదిక ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని విస్మరించారని మండిపడ్డారు. అలాగే రెండో దశ గొర్రెల పంపిణీ ఏమైందని ప్రశ్నించారు. మొదటి విడతలో జరిగిన కుంభకోణంలో కేసీఆర్‌ను కాపాడే ప్రయత్నం జరుగుతోందన్నారు.

‘అర్బన్‌’లో సమస్యలు..

నిజామాబాద్‌ అర్బన్‌లో ఎన్నో సమస్యలు తలెత్తాయని, వాటిని పరిష్కరించాలని కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్లను కోరానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రధానంగా వినాయక్‌ నగర్‌, ఎల్లమ్మ గుట్టలో బ్రిడ్జి పనులను పూర్తిచేయాలని కంఠేశ్వర్‌, గాజుల్‌ పేట్‌, దేవి టాకీస్‌ సమీపంలోని శ్మశాన వాటికలో సౌకర్యాలు కల్పించాలని కోరినట్లు చెప్పారు. పాత కలెక్టరేట్‌ స్థలంలో క్రీడా స్టేడియం నిర్మించాలని, శంభుని గుడి చుట్టూ ఆక్రమించిన దుకాణాలను తొలగించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో బీజేపీ ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి రాజు, కార్పొరేటర్లు ఎర్రం సుధీర్‌, మాస్టర్‌ శంకర్‌, ఆఫీస్‌ సెక్రటరీ కిషన్‌ నాయకులు పాల్గొన్నారు.