అక్షరటుడే, ఇందూరు: ఖిల్లా, అలీ సాగర్ ఫిల్టర్ బెడ్‌ల నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యాన్ని వీడాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా హెచ్చరించారు. శుక్రవారం ఫిల్టర్ బెడ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరవాసులకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. అలీసాగర్‌లో ప్రస్తుతం ఉన్న నీరు రానున్న రెండు నెలలకు మాత్రమే సరిపోతుందని పేర్కొన్నారు. అలాగే ఖిల్లా ఫిల్టర్ బెడ్‌లో సగం యంత్రాలు పనిచేయకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చెత్త పేరుకుపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి వారం రోజుల్లో సమస్య పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంట పలువురు బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు.