అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని బస్‌డిపో వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాల పాలైన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. నస్రుల్లాబాద్‌ మండలం నాచుపల్లికి చెందిన సాయికుమార్‌, బీర్కూర్‌ మండలం చించోల్లికి చెందిన మారుతి శుక్రవారం ద్విచక్ర వాహనంపై పట్టణానికి వచ్చారు. రాత్రి సమయంలో తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. బస్‌డిపో వద్ద అతివేగంగా వస్తున్న కారు వీరి వాహనాన్ని ఢీకొంది. సాయికుమార్‌, మారుతి కింద పడిపోగా ఇదే సమయంలో వెనక నుంచి వచ్చిన లారీ వీరి కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. చికిత్స నిమిత్తం మారుతిని హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయికుమార్‌ నిజామాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.