అక్షరటుడే, నిజామాబాద్‌: వడ్డీ వ్యాపారులపై పోలీసుల దాడులు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. అధిక వడ్డీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో సోమవారం తనిఖీలు చేసి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కానీ పోలీసుల దాడుల్లో చిన్నచిన్న వాపారులే పట్టుబడినట్లు తెలుస్తోంది.

రూ. కోట్లలో దందా నడిపిస్తున్నా..

నిజామాబాద్‌ నగరంలో పలువురు వడ్డీ వ్యాపారులు రూ. కోట్లల్లో దందా నడిపిస్తున్నారు. ఈ జాబితాలో ప్రముఖ హోటల్‌ యజమాని, కూల్‌డ్రింక్స్ డీలర్‌షిప్‌ నిర్వాహకుడు, వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వైద్యులతో పాటు గంజ్‌లో మరో ఇద్దరు వ్యాపారులున్నారు. అత్యంత ఖరీదైన వెంచర్లకు పెట్టుబడిగా వీరే రూ. కోట్ల మొత్తాన్ని వడ్డీకి ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. నేరుగా ఆస్తులు బినామీలపై రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం, ప్రతి నెలా పెద్దమొత్తంలో వడ్డీ వసూలు చేయడం వీరి అసలు దందా.! జీరో వ్యాపారం ద్వారా ఈ వ్యాపారుల వద్ద పెద్దఎత్తున మనీ లాండరింగ్ జరుగుతోంది. ఆదాయ పన్నును సైతం ఎగ్గొడుతున్నారు. కానీ, పోలీసుల తనిఖీ చిట్టాలో వీరి పేర్లు ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యకరం.

ఎన్నికల్లో హవాలా..!

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరితో పాటు పలువురు గంజ్ వ్యాపారులు హవాలా ద్వారా డబ్బును తరలించారు. ఒకరిద్దరు నేతలు వీరి ద్వారానే నగదు లావాదేవీలు చేసి ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు ఆరోపణలున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ధన ప్రవాహం కట్టడి జరగాలంటే.. వీరి అక్రమ వడ్డీ వ్యాపారం దందాకు పోలీసులు బ్రేక్ వేయాల్సిన అవసరముందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.