అక్షరటుడే, వెబ్ డెస్క్: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరైంది. కోర్టు ఆదేశాలతో శనివారం ఆయన న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. కాగా.. రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.15వేల బాండ్, రూ.లక్ష పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తునకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేజ్రీవాల్‌కు ఎనిమిది సార్లు నోటీసులు జారీ చేసింది. అయినా విచారణకు హాజరుకాకపోవడంతో ఈడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో ఫిబ్రవరి 17న కోర్టుకు రావాలని ఆదేశించింది. అదే సమయంలో ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉండడంతో ఆయన వర్చువల్‌గా హాజరయ్యారు. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని తెలిపారు. దీంతో అప్పుడు కోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండగా ఈడీ మార్చి 4న విచారణకు రావాలని మరోసారి పిలిచింది. కానీ ఆయన గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ మరోసారి కోర్టుకు వెళ్లడంతో మార్చి 16న తప్పకుండా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన శనివారం న్యాయస్థానంలో హాజరుకాగా బెయిల్ మంజూరైంది. మరోవైపు లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ కోర్టులో హాజరుపర్చింది. అలాగే పది రోజుల కస్టడీ కోరింది. బెయిల్ లభిస్తుందా? జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది.