అక్షరటుడే, వెబ్ డెస్క్: రాజ్యాంగ బద్ధమైన ప్రధాని పదవిలో ఉన్న నరేంద్ర మోదీ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. తప్పుడు మాటలతో దేశ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన జనజాతర సభలో ఆయన ప్రసంగించారు. తాను రాముడిని, కృష్ణుడిని ఆరాధిస్తానని.. పోచమ్మ, మైసమ్మలను మొక్కతానని, ఒక హిందువుగా దేవతలను కొలుస్తానని తెలిపారు. అలాగే ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు మత విశ్వాసాలను గౌరవిస్తానని అన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య పంచాయితీ పెడుతోందని, అలా జరిగితే దేశం అధోగతి పాలవుతుందని విమర్శించారు. దేవుడు గుడిలో ఉండాలని.. భక్తి గుండెల్లో ఉండాలని.. పోలింగ్‌ బూత్‌ల్లో కాదని ధ్వజమెత్తారు. ఇండియా కూటమి గెలిస్తే జీవన్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని చేయించే బాధ్యత తనదని ప్రకటించారు. నిజాంషుగర్‌ ఫ్యాక్టరీ తెరిపించేందుకు, పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఆగస్టు 15వ తేదీ వరకు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. వరి రైతులకు ఎకరాకు రూ. 500 బోనస్‌ ఇస్తామని తెలిపారు. జొన్న, మక్క రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ మధుగౌడ్‌ యాష్కీ, మంత్రి శ్రీధర్‌బాబు, రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు ఈరవత్రి అనిల్‌, తాహెర్‌బిన్‌ హందాన్‌, జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.