స్పాట్‌ వాల్యూయేషన్‌ డబ్బులు ఇవ్వాలని ఆందోళన

0

అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: గతేడాది ఇంటర్‌ స్పాట్‌ వాల్యూయేషన్‌ చేసిన సిబ్బందికి ఇచ్చే రెమ్యూనరేషన్‌లో అకారణంగా కట్‌చేసిన డబ్బులు చెల్లించాలని టీపీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో అధ్యాపకులు ఆందోళనకు దిగారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇంటర్మీడియట్ అధికారి కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రైవేటు లెక్చరర్స్ ఫోరం(టీపీఎల్‌ఎఫ్‌) జిల్లా అధ్యక్షుడు మోహన్‌రావు మాట్లాడుతూ జిల్లాలో గతేడాది వెయ్యి మందికిపైగా అధ్యాపకులు ఇంటర్‌ స్పాట్‌ వాల్యూయేషన్‌లో పాల్గొన్నారని వివరించారు. తమకు రావాల్సిన డబ్బుల్లో అధికారులు 20శాతం కట్‌ చేశారని తెలిపారు. ఈ విషయమై అధికారులను సంప్రదించగా ఒకసారి ఆడిట్‌ చేయలేదని.. మరోసారి బిల్లు ఫారాలపై రెవెన్యూ స్టాంప్‌ పెట్టలేదని కట్‌ చేసినట్లు చెప్పారని వాపోయారు. అలాగే కేంద్రంలో కనీస వసతులు కల్పించలేదని పేర్కొన్నారు. దీనిపై ఇన్‌చార్జి క్యాంపు ఆఫీసర్‌ రవికుమార్‌ స్పందిస్తూ.. స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రంలో సౌకర్యాలు కల్పిస్తామని, సిబ్బందికి రావాల్సిన డబ్బులు మూడు రోజుల్లో ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు శంకర్‌, శాంతికుమార్‌, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.