అక్షరటుడే, వెబ్‌డెస్క్: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ సెక్రెటరీ బుర్రా వెంకటేశం ఫలితాలను రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 91.31 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా ఫలితాల్లో 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. నిజామాబాద్ 93.72 శాతంతో 14వ స్థానంలో, కామారెడ్డి 92.71 శాతంతో 19వ స్థానంలో నిలిచాయి. ఇక 65.10 శాతం ఫలితాలతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా బాలికలే పైచేయి సాధించారు. 93.23 శాతం మంది ఉత్తీర్ణులుగా కాగా, బాలురు 89.42 శాతం మంది పాసయ్యారు. ఈ సందర్భంగా విద్యాశాఖ సెక్రెటరీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,08,385 మంది విద్యార్థులు పరీక్ష రాశారని తెలిపారు. 3,2927 పాఠశాలలు ఉత్తీర్ణత సాధించాయని పేర్కొన్నారు. రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి మే 15వ తేదీ వరకు అవకాశం ఇచ్చామన్నారు. ఇక జూన్ 3వ తేదీ నుంచి 13వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు.