అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: టీచర్‌ నియామకాల కుంభకోణం కేసులో కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2016 నాటి స్టేట్‌ లెవల్‌ సెలక్షన్‌ టెస్ట్‌(ఎస్‌ఎల్‌ఎస్‌టీ) నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టం చేసింది. ఆ పరీక్షతో జరిపిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సుమారు 26 వేల మంది ఉద్యోగాలు రద్దు కానున్నాయి. అంతేకాకుండా ఉద్యోగాలు సాధించిన టీచర్లు తమ వేతనాన్ని నాలుగు వారాల్లో తిరిగి ఇచ్చేయాలని తీర్పులో వెల్లడించింది. డబ్బు వసూలు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని సూచించింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ మాజీ విద్యాశాఖ మంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పార్థా ఛటర్జీని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాల్‌ చేసే అవకాశం ఉంది. 2016లో పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎల్‌ఎస్‌టీ పరీక్ష నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీకి పరీక్ష నిర్వహించగా.. 23 లక్షల మంది హాజరయ్యారు. అనంతరం ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందిని నియమించిన విషయం తెలిసిందే. ఈ నియామకాల్లో అనేక అవకతవకలు జరిగాయని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ చేపట్టిన హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.