అక్షరటుడే, బాన్సువాడ: నస్రుల్లాబాద్‌ మండలంలోని సంగెం గ్రామంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. గ్రామంలో ఒకరి తర్వాత మరొకరు ఒళ్లు నొప్పులు, జ్వరాలతో బాధపడుతున్నారు. ఏ రోగం వచ్చిందోనని భయాందోళనకు గురవుతున్నారు. ఇంటికి ఇద్దరు చొప్పున మంచం పడుతుండడంతో ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో బీర్కూరు పీహెచ్ సీ వైద్యాధికారి గిరీష్‌ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పారిశుధ్య లోపం వల్లే విపరీతమైన దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకాధికారులు పంచాయతీల్లో పర్యటించి గ్రామ సమస్యలు పరిష్కరించాల్సి ఉండగా పట్టించుకోకపోవడంతో విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని చెబుతున్నారు.