కట్టుకున్నోడిని కడతేర్చి.. ఆత్మహత్యగా చిత్రీకరించి..

0

అక్షరటుడే, బోధన్‌: కట్టుకున్న భర్తను కడతేర్చిందో మహిళ. తాగొచ్చి హింసిస్తున్నాడని గొంతు నులిమి హతమార్చింది. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించి.. చివరికి పోలీసులకు చిక్కింది. ఈ ఘటన నవీపేట మండలం జన్నేపల్లిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్నేపల్లికి చెందిన మక్కల సాయిలు(45) తాగొచ్చి భార్యను హింసించేవాడు. దీంతో భార్యాభర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో గురువారం కూడా భర్త తాగిసి వచ్చే ఆమెతో గొడవపడ్డాడు. ఈ సమయంలో వారి ఇద్దరు పిల్లలు బయటకు వెళ్లారు. గొడవ జరుగుతున్న సమయంలో భార్య ఆగ్రహంతో భర్త గొంతును నులిమింది. దీంతో అపస్మారకస్థితికి చేరిన సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. భయానికి లోనైన ఆమె.. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. భర్త మెడకు ఉరివేసి ఇంట్లోని దూలానికి వేలాడదీసింది. కొద్ది సేపటికి పిల్లలు ఇంటికి రావడంతో నాన్న సూసైడ్ చేసుకున్నాడని వారిని నమ్మించి మృతదేహాన్ని కిందికి దింపింది. పోలీసులకు తెలిస్తే కేసు పెడతారని పిల్లలకు చెప్పి..సాధారణ మృతిగా సీన్ క్రియేట్ చేసింది. అనంతరం సాయిలు మృతి చెందాడని బంధువులకు తెలిపింది. వారు వచ్చి మృతదేహాన్ని చూడగా అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగప్రవేశం చేసి విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. భర్తను తానే గొంతునులిమి హతమార్చినట్లు నిందితురాలు ఒప్పుకుంది. దీంతో పోలీసులు సాయిలు భార్యను అరెస్టు చేశారు.