కాపుకాసి.. వేటువేసి..

0

అక్షరటుడే, బోధన్‌: మాటువేసి సొంత అన్నయ్యను తమ్ముడు హతమార్చిన ఘటన కోటగిరి మండలం పొతంగల్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పొతంగల్‌ గ్రామానికి చెందిన గోవింద్‌(54)ను తన తమ్ముడు విఠల్‌ గొడ్డలితో దాడిచేసి దారుణంగా హత్యచేశాడు. మృతుడు స్థానికంగా క్షౌరం చేస్తూ జీవనం సాగించేవాడు. రోజూ మాదిరిగానే తన వృత్తిని ముగించుకొని గురువారం రాత్రి ఇంటికి వెళ్లాడు. అక్కడే మాటువేసి ఉన్న తమ్ముడు విఠల్‌ అన్న గోవింద్‌పై ఒక్కసారిగా గొడ్డలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే అన్నతో ఉన్న పాత గొడవల నేపథ్యంలోనే హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.