అక్షరటుడే, ఇందూరు: జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఒక్కో పాఠశాల ఒక్కో విధమైన ప్రకటనలతో తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. వాటిని నమ్మి ఎలాంటి ఆలోచన చేయకుండానే తమ పిల్లలను ప్రైవేటు బడుల్లో చేర్పిస్తున్నారు. అయితే జిల్లాలో పలు ప్రైవేట్ పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండానే నూతన విద్యా సంవత్సరంలో అడ్మిషన్స్ చేపట్టాయి. తాజాగా వాటికి సంబంధించిన జాబితాను డీఈవో విడుదల చేశారు. చర్యలు తీసుకోవాలని మండల విద్యాధికారి రామారావును ఆదేశించారు. కానీ, ఆయా యాజమాన్యాలపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఫలితంగా పిల్లల అడ్మిషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి.
ఆ నాలుగు బడులు..
జిల్లాలో నాలుగు పాఠశాలలకు విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతి లేదు. నిజామాబాద్ అర్బన్ లో ప్రెసిడెన్సీ పాఠశాల(శ్రీ నగర్ కాలనీ నూతన బిల్డింగ్), నిశిత ఇంటర్నేషనల్ పాఠశాల(అమ్మ వెంచర్), హెచ్ పీఎస్ పాఠశాల(చంద్రశేఖర్ కాలనీ), అలాగే డిచ్పల్లి మండలం బర్దిపూర్ లోని విక్టర్ పాఠశాలకు పర్మిషన్ లేనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, ఈ యాజమాన్యాలు మాత్రం హోర్డింగ్స్, ఇతర ప్రకటనలు కొనసాగిస్తున్నాయి. ఎంఈవో అండదండలతోనే దర్జాగా అడ్మిషన్లు చేపట్టినట్లు విద్యార్థి సంఘాలు తాజాగా డీఈవోకు ఫిర్యాదు చేశాయి. అందుకే సంబంధిత పాఠశాలలు సీజ్ చేయడం గానీ చర్యలు తీసుకోవడం గానీ చేపట్టలేదని తెలుస్తోంది.

ఎంఈవోను ఆదేశించాను: డీఈవో
ప్రతి పాఠశాల జిల్లా విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకుని నడపాల్సి ఉంటుందని డీఈవో దుర్గా ప్రసాద్ స్పష్టం చేశారు. ‘పర్మిషన్ లేని వాటికి బోనాఫైడ్ ఇవ్వము. ఇప్పటికే అటువంటి పాఠశాలల హార్డింగ్స్ ను తొలగించాలని ఎంఈవోను ఆదేశించాను. తల్లిదండ్రులు అన్నీ ఆలోచించి కేవలం అనుమతి ఉన్న పాఠశాలల్లో మాత్రమే తమ పిల్లలను చేర్పించాలి.’ అని ఆయన స్పష్టం చేశారు.