అక్షరటుడే, నిజామాబాద్‌: కమిషనరేట్‌లో అది కీలకమైన విభాగం. ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా.. ఇసుక, మొరం అక్రమ రవాణా జరిగినా.. పీడీఎస్‌ దందా చేసినా దాడులు చేసి చర్యలు తీసుకోవాల్సింది వారే..! కానీ, ఈ విభాగంలో పనిచేస్తున్న అధికారి ఇవన్నీ పక్కనపెట్టి ఏకంగా వసూళ్లకు తెరదీశారు. తాజాగా నగర శివారులోని ఓ హోటల్‌లో జూదం నడుస్తున్న వ్యవహారంలో ఈ విభాగంపై ఆరోపణలు వచ్చాయి. మాక్లూర్‌కు చెందిన ఓ నిర్వాహకుడు సదరు హోటల్‌లో పేకాట నడిపిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. దీంతో ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను హెడ్‌క్వార్టర్‌కు అటాచ్‌ చేశారు. కానీ, తెరవెనుక విభాగం అధికారి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి పలుమార్లు సదరు అధికారి ఇదే హోటల్‌లో గది తీసుకుని ఉండేవారని తెలిసింది. దీంతో పాటు పీడీఎస్‌ బియ్యం దందా నిర్వహించే వారు, ఇసుక, మొరం అక్రమ రవాణాకు పాల్పడే వ్యాపారుల నుంచి నెలనెలా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో దందాలు నిర్వహిస్తున్న వారంతా తిరిగి దర్జాగా అక్రమ రవాణా చేస్తున్నప్పటికీ అటువైపు కన్నెత్తి చూడట్లేదు. ఈ కారణంగానే విభాగం ఆధ్వర్యంలో దాడులు తగ్గాయని పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. మాక్లూర్‌ ప్రాంతంలో వీరి అండతోనే పలు పేకాట అడ్డాలు నడుస్తున్నాయని ప్రచారంలో ఉంది. మరోవైపు విభాగంలో పనిచేసే ఇద్దరు సిబ్బందిని వ్యక్తిగత అవసరాల కోసం రోజుల తరబడి హైదరాబాద్‌కు పరిమితం చేశారని తెలిసింది. ఇతర జిల్లాలకు సంబంధించిన కేసులను సైతం ఎలాంటి ఫిర్యాదు లేకుండానే ఇక్కడే సెటిల్‌మెంట్‌ చేస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. కీలక విభాగంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.