అక్షరటుడే, ఇందూరు: జిల్లా విద్యాశాఖలో నిబంధనలకు విరుద్ధంగా జారీచేసిన ఏఎంవో డిప్యుటేషన్‌ ఉత్తర్వు రద్దయ్యింది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఈవో అశోక్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భీమ్‌గల్‌ మండలం పల్లికొండలో పనిచేస్తున్న సుధాకర్‌రెడ్డిని ఏఎంవోగా నియమిస్తూ బదిలీపై వెళ్తున్న డీఈవో దుర్గాప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా ఆగమేఘాలపై డిప్యుటేషన్‌ ప్రతిపాదనలు పంపి.. ఆపై నిబంధనలు ఉల్లంఘించి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విషయమై ‘అక్షరటుడే’లో ‘విద్యాశాఖలో అక్రమాల తంతు’ అనే శీర్షికన కథనం ప్రచురితం కాగా పలు ఉపాధ్యాయ సంఘాలు ఆర్జేడీకి ఫిర్యాదు చేశాయి. అలాగే బుధవారం బాధ్యతలు స్వీకరించిన నూతన డీఈవో దృష్టికి ‘అక్షరటుడే’ కథనాన్ని తీసుకెళ్లాయి. దీనిపై స్పందించిన ఆయన సదరు ఉత్తర్వులు నిలిపివేశారు. అలాగే బదిలీ అయిన తర్వాత డీఈవో దుర్గాప్రసాద్‌ ఒకేరోజులో కీలకమైన పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. ఇందులో కొందరు ఉపాధ్యాయుల డిప్యుటేషన్‌ ఉత్తర్వులు ఉన్నట్లు సమాచారం. కాగా వాటన్నింటిపై డీఈవో ఆరా తీశారు. నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన ఉత్తర్వులన్నింటికీ రద్దు చేస్తారని సమాచారం. ఈ పరిణామాలపై ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు తెలిసింది.

ఉత్తర్వులు రద్దు చేయాలని వినతి

నిబంధనలకు విరుద్ధంగా నియమించిన ఏఎంవో ఉత్తర్వులను రద్దు చేయాలని టీపీటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు వెనిగళ్ల సురేష్, సత్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం నూతన డీఈవో అశోక్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏఎంవో పోస్టులు భర్తీ చేయాలని భావిస్తే ఓపెన్ నోటిఫికేషన్ ద్వారా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను లేదా సీనియర్ స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని కోరారు.