అక్షరటుడే, భిక్కనూరు: మండల కేంద్రంలో రూ.3కోట్ల విలువ చేసే 10 గుంటల భూమిని వీడీసీకి తిరిగి ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. భిక్కనూరు గ్రామాభివృద్ధి కమిటీకి చెందిన స్థలం కబ్జాకు గురైన సంగతి విదితమే. ఈ విషయం నెల రోజులుగా భిక్కనూరు మండల కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. పలుమార్లు అఖిలపక్షం నేతలు ఈ అంశంపై ప్రకటనలు జారీ చేశారు. కాగా.. గ్రామాభివృద్ధి కమిటీకి చెందిన స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వ్యక్తిని మంగళవారం అఖిలపక్ష నేతలు, గ్రామస్థులు చమాన్‌ ప్రాంతానికి పిలిపించారు. భూమి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వ్యక్తికి, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు వీడీసీకి 10 గుంటల భూమిని తిరిగి రిజిస్ట్రేషన్‌ చేయించి ఇచ్చేందుకు సదరు వ్యక్తి సమ్మతించాడు. దీంతో గ్రామస్థులు, సదరు వ్యక్తి భూమికి సంబంధించిన కొలతలు కొలిచారు. ఈ నెల 28న తాను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న స్థలం నుంచి వీడీసీకి రావాల్సిన 10 గుంటలను అప్పగిండచంతో పాటు హద్దులు ఏర్పాటు చేసి ఇస్తానని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చాడు. దీంతో గ్రామస్థులు శాంతించారు.