Advertisement

అక్షరటుడే, కామారెడ్డి: ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బీబీపేట మండలం తుజాల్​పూర్​లో చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రవీణ్ గౌడ్ మూడేళ్ల క్రితం ఇంటి నిర్మాణం కోసం రూ. మూడు లక్షలను కామారెడ్డిలోని ఫైవ్ స్టార్ ప్రైవేట్ ఫైనాన్స్​లో రుణం తీసుకున్నాడు. మొదటినుంచి ఈఎంఐలు సక్రమంగా చెల్లిస్తున్నాడు. చివరి ఈఎంఐ రూ. 8వేలు చెల్లించడంలో జాప్యం కావడంతో ఫైనాన్స్ యాజమాన్యం సిబ్బంది ఐదు రోజులుగా ప్రవీణ్​ను వేధింపులకు గురి చేశారు. అంతేకాకుండా అతని ఇంటికి వెళ్లి దుర్భాషలాడుతూ సిబ్బంది వేధించారు. దీంతో మనోవేదనకు గురైన ప్రవీణ్​గౌడ్​ గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య అర్చన, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటి పెద్ద ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం వీధిన పడింది. ప్రవీణ్ గౌడ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బీబీపేట పోలీసులు తెలిపారు.

Advertisement