అక్షరటుడే, బాన్సువాడ: డ్వాక్రా సంఘాల డబ్బులను కాజేసిన మహిళ తిరిగి ఇవ్వకపోవడంతో గ్రామస్థులు ఆమె ఇంటికి తాళం వేసిన ఘటన పోతంగల్ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. కల్లూరు గ్రామంలో రెండు నెలల క్రితం కెనరా బ్యాంకు అనుసంధానమైన సీఎల్పీ సెంటర్ నిర్వాహకురాలు సంధ్య మహిళా సంఘాలకు చెందిన రూ. 40 లక్షలను స్వాహా చేసింది. దీనిపై మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులు పెద్దల సమక్షంలో ఇటీవల పంచాయితీ పెట్టారు. అయితే డబ్బులను నెల రోజుల్లో తిరిగి మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేస్తానని ఒప్పుకోవడంతో శాంతించారు. కానీ రెండు నెలలు అవుతున్నా డబ్బులు జమ చేయకపోవడంతో బుధవారం నిర్వాహకురాలి ఇంటికి సంఘాల సభ్యులు తాళం వేశారు. అనంతరం ఇంటిని బహిరంగ వేలం వేశారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ. 14.80 లక్షలకు దక్కించుకున్నాడు. అయితే సదరు మహిళ సంఘాల ఖాతాల్లో రూ. ఆరు లక్షలు జమ చేసినట్లు సమాచారం.