అక్షరటుడే, వెబ్‌డెస్క్ SHAKTHI App : మన దేశంలో మహిళలకు రక్షణ కరువైంది. ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్తే తిరిగి ఇంటికి వచ్చేదాక ఇంట్లో ఉన్న వాళ్లకి టెన్షనే. మహిళలకు బయట ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేం. మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు వచ్చాయి. అయినా వాళ్ల మీద జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం తగ్గడం లేదు. అందుకే రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మహిళల భద్రతే లక్ష్యంగా శక్తి అనే ఒక మొబైల్ యాప్ ను డెవలప్ చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు శక్తి యాప్ ను అసెంబ్లీలో లాంచ్ చేశారు.
ఈ యాప్ ను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ తమ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలని, అనుకోని ప్రమాదాల్లో ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్నప్పుడు యాప్ ఓపెన్ చేసి జస్ట్ ఫోన్ ను మూడు సార్లు షేక్ చేస్తే చాలు. ఆటోమెటిక్ గా కంప్లయింట్ రిజిస్టర్ అవుతుంది. ఆ మహిళ ఉన్న లొకేషన్ కి అంటే సంఘటన జరిగిన ప్రాంతానికి పోలీసులు 6 నుంచి 9 నిమిషాల్లోపు చేరుకుంటారు. జీపీఎస్ ద్వారా సంఘటన స్థలాన్ని పోలీసులు ట్రాక్ చేసి అక్కడికి వెంటనే చేరుకుంటారు.
SHAKTHI App : పోలీసులకు సీఎం చంద్రబాబు వార్నింగ్
ఒకసారి కంప్లయింట్ రిజిస్టర్ అయిన తర్వాత ఆ మహిళకు ఏమైనా జరిగినా, పోలీసులు రెస్పాండ్ కాకపోయినా పోలీసులదే బాధ్యత. ఒకసారి టెక్నాలజీలో రిజిస్టర్ అయిన తర్వాత పోలీసులు ఆ కేసుపై పోలీసులు అప్రమత్తంగా లేకపోతే, అది పోలీసుల ఫెయిల్యూర్ కిందికి వస్తుంది. అది కూడా రిజిస్టర్ అవుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండి పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే వాళ్లపై కూడా యాక్షన్ ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు.