అక్షరటుడే, హైదరాబాద్: Chit Fund : తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ చిట్‌ఫండ్ మోసం వెలుగుచూసింది. వరంగల్ కేంద్రంగా ఏర్పాటు చేసిన అక్షర చిట్‌ఫండ్ బోర్డు తిప్పేసింది. ఫలితంగా సదరు కంపెనీలో డబ్బులు జమ చేసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. వరంగల్, కరీంనగర్‌తో పాటు తాజాగా నిజామాబాద్‌లోనూ బాధితులు రోడ్డెక్కారు.
Chit Fund : 70 మంది బాధితులు..
నిజామాబాద్‌లో అక్షర చిట్‌ఫండ్ కంపెనీ బాధితులు 70 మంది వరకు ఉన్నట్లు చెబుతున్నారు. వీరి నుంచి రూ.3 కోట్ల వరకు కంపెనీ ప్రతినిధులు సేకరించినట్లు బాధితులు పేర్కొంటున్నారు. బాధితుల్లో 2019 నుంచి డబ్బులు చెల్లించిన వారు ఎక్కువ మంది ఉన్నారు. విచారణ చేపడితే మరింత మంది బాధితులు వెలుగుచూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Chit Fund : ఏమిటీ కంపెనీ..
అక్షర చిట్‌ఫండ్ కంపెనీని 2009లో ఏర్పాటు చేశారు. రూ.1,200 కోట్ల అధీకృత వాటా మూలధనాన్ని లెక్కల్లో చూపారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Corporate Affairs – MCA), ప్రకారం, 27-11-2009న అక్షర చిట్‌ఫండ్ కంపెనీ స్థాపించబడింది. చివరిగా ఫిబ్రవరి 8, 2023న నవీకరించబడింది.
Chit Fund : గత నెలలో కరీంనగర్లో..
డిపాజిట్లు(deposits), చిట్టీల ద్వారా భారీగా డబ్బులు సేకరించి గడువు ముగిసినా కూడా సభ్యులకు డబ్బులు చెల్లించకపోవడంతో కరీంనగర్లో బాధిత ఖాతాదారులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కరీంనగర్ పోలీసులు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తెలంగాణ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ డిపాజిటర్ల రక్షణ చట్టం, 1999(చట్టం నం. 19 ఆఫ్ 1999) సెక్షన్ 5 కింద, అక్షర టౌన్ షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా సంపాదించిన స్థిరాస్తులను అటాచ్ చేయాలని గతంలోనే కరీంనగర్ పోలీస్ కమిషనర్ ప్రభుతాన్ని కోరారు.
Chit Fund : ఆస్తుల అటాచ్..
ఈ మేరకు “అక్షర టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్”కు డిపాజిటర్స్ చెల్లించిన డబ్బుల ద్వారా అక్రమంగా సంపాదించిన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామ పరిధిలోని రూ.11.50 కోట్ల విలువైన 50 ఎకరాల భూములు, రామడుగు మండలం వెలిచాల గ్రామ పరిధిలోని రూ. 2.70 కోట్ల విలువ 24,606 చదరపు గజాల స్థిరాస్తులు.. మొత్తంగా రూ. 14.27 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Chit Fund : సంస్థ ప్రతినిధుల అరెస్టు..
బాధితుల ఫిర్యాదు మేరకు అక్షర చిట్ ఫండ్స్, అక్షర టౌన్ షిప్ ప్రయివేట్ లిమిటెడ్ యాజమాన్యానికి చెందిన ప్రధాన నిందితుడు హన్మకొండకు చెందిన ఏ1 పేరాల శ్రీనివాస రావు, ఏ2 పేరాల శ్రీవిద్య, ఏ3 సూరనేని కొండలరావు, ఏ4 పుప్పాల రాజేందర్, ఏ5 అలువుల వరప్రసాద్, A6 గొనె రమేష్ పై గతేడాది ఫిబ్రవరిలో పోలీసులు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.