- నెరవేరిన పసుపు రైతుల ఏళ్లనాటి కల
- నేడు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు
- ఇక ప్రపంచ పసుపు హబ్ గా నిజామాబాద్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉత్తర ధాన్యగారంగా పేరొందిన ఇందూరు చరిత్రలో మరో సువర్ణధ్యాయం లిఖితమైంది. పసుపు రైతుల, ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంత కర్షకుల దశాబ్దాల కల సాకారమైంది. ఈ సంక్రాంతి తెలంగాణ పసుపు రైతులకు నిజమైన పండుగ కానుంది. నిజామాబాద్ జిల్లాలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ సోమవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పసుపు బోర్డు ఛైర్మన్ గా అంకాపూర్ వాసి పల్లె గంగారెడ్డిని నియమించింది. నేడు(మంగళవారం, జనవరి 14, 2025) ఉదయం 10 గంటలకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్.. వర్చువల్‌గా జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. నిజామాబాద్ లోని హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ ఇందుకు వేదిక కానుంది.
ఇవీ ప్రయోజనాలు
పసుపు బోర్డు ఏర్పాటుతో.. కొత్త వంగడాల అభివృద్ధి నుంచి హార్వెస్ట్ మేనేజ్మెంట్ మార్కెట్ వరకు రైతులకు లబ్ధి చేకూరుతుంది. పంట నాణ్యత, దిగుబడి పెంచేలా సూచనలు, సలహాలు అందిస్తారు. పసుపు తవ్వకం, ఉడకబెట్టడం, ఆరబెట్టడం, డ్రై చేయడానికి అవసరమైన యంత్రాలను సర్కారు రాయితీపై అందిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో జరిగే పరిశోధనలు, ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి వస్తాయి.
ఏళ్లుగా డిమాండ్..
నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రైతుల నుంచి గట్టి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అర్వింద్ బాండ్ పేపర్ పై రాసి హామీ ఇస్తూ.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు గట్టిగానే కృషి చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారు. పార్లమెంటులో ఇందూరు ప్రాంత పసుపు రైతుల గళం వినిపించారు. కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగారు. దీంతో నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. కాగా, ఎక్కువ విస్తీర్ణంలో పసుపును పండించే తమ రాష్ట్రంలోనే పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం, అక్కడి భాజపా నాయకులు తీవ్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడిని తెచ్చారు. ఇదే సమయంలో ఎంపీ అరవింద్ తన పార్లమెంట్ నియోజకవర్గంలోనే బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర పెద్దలను కలిసి వివరించారు. ఇచ్చిన మాట కోసం నిజామాబాదులోనే బోర్డ్ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నిజామాబాద్ త్వరలో ప్రపంచ పసుపు హబ్ గా మారనుంది.
భారత్ అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారు
ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారు. వినియోగం, ఎగుమతుల్లోనూ మనమే ముందు వరుసలో ఉన్నాం. అంతర్జాతీయంగా ఏడాదికి సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నుల పసుపు ఉత్పత్తి అవుతోంది. కాగా, అందులో భారత్ వాటా 78% వరకు ఉంటుంది. చైనా 8%, మయన్మార్ 4%, తర్వాతి స్థానాల్లో నైజీరియా, బంగ్లాదేశ్ వంటి మిగతా దేశాలున్నాయి.
దేశ వ్యాప్తంగా తెలంగాణలోనే అత్యధికం
రాష్ట్రంలో.. 2023-24లో 0.23 లక్షల హెక్టార్లలో 1.74 లక్షల టన్నుల పసుపు ఉత్పత్తి అయింది. రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే.. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోనే 90%నికి పైగా పసుపు ఉత్పత్తి ఉంటుంది.