అక్షరటుడే, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో కేటుగాళ్లు భారీ మోసానికి తెరలేపారు. చిన్న తరహా పెట్టుబడుల పేరుతో అమాయకులకు అధిక లాభాలు ఆశ చూపి రూ.850 కోట్లు కొట్టేశారు.
క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మాదాపూర్ లో 2021లో కొంత మంది కంపెనీ పెట్టారు. చిన్న తరహా పెట్టుబడుల పేరుతో ఫోంజి పథకం తీసుకొచ్చారు. ఏజెంట్లను నియమించుకుని అమాయకులకు వల వేశారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయంటూ నమ్మించారు. ప్రముఖ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయని, మెుబైల్ అప్లికేషన్ ప్రారంభించి వసూళ్లకు పాల్పడ్డారు. వారి మాటలు నమ్మిన 6,979 మంది ఏకంగా రూ.1,700 కోట్ల డిపాజిట్లు సేకరించారు. ఒక్కొక్కరి వద్ద రూ.25 వేల నుంచి రూ.9 లక్షల వరకు వసూలు చేశారు. అందినకాడికి దోచుకొని గత నెల 15న క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బోర్డు తిప్పేశారు.
బాధితులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంస్థ వైస్ ప్రెసిడెండ్ పవన్ కుమార్ ఓదెల, డైరెక్టర్ కావ్య నల్లూరిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు అమర్ దీప్ కుమార్, అర్యాన్ సింగ్, యుగంధర్ సింగ్ తో కలిసి వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో తేలింది. సేకరించిన రూ.1,700 కోట్లలో రూ.850 కోట్లు తిరిగి చెల్లించారని, మిగతా రూ.850 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారని తెలిసింది. ఆ నగదును 14 షెల్ కంపెనీలకు దారి మళ్లించినట్లు సమాచారం.