అక్షరటుడే, వెబ్‌డెస్క్: AP CID : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ సీఐడీ కార్యాలయంలో బుధవారం విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
AP CID : పలు సెక్షన్ల కింద..
విజయసాయిరెడ్డికి ఏ కేసులో ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చిందనే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు కానీ, కాకినాడ పోర్టు అంశంలో కావొచ్చని భావిస్తున్నారు. కాకినాడ పోర్టును బలవంతంగా రాయించుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై గతంలో కేసులు నమోదయ్యాయి. ఇదే కేసులో ఈడీ కూడా విచారణకు పిలించింది. సీఐడీ నోటీసుల్లో 506, 384, 420, 109,467, 120(b) రెడ్ విత్ 34 BNS సెక్షన్లు పొందుపర్చారు.
AP CID : బెదిరించి వాటాల కాజేత..
కాకినాడ సీపోర్టును బెదిరించి అన్యాయంగా వాటాలను రాయించుకున్నారని సీఐడీకి ఆ పోర్టు యజమాని కేవీ రావు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఎంపీ విజయసాయి రెడ్డి, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి, ఆడిటింగ్ కంపెనీ పీకేఎఫ్(చెన్నై) ప్రతినిధులు సుందర్, విశ్వనాథ్, ప్రసన్నకుమార్, అపర్ణలను నిందితులుగా చేర్చారు.
సెజ్‌ను రాయించుకున్న అరబిందో ఇన్‌ఫ్రాను ఈ కేసులో చేర్చారు. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించి, భయపెట్టి అత్యధిక షేర్లను అరబిందో సంస్థ వారు సొంతం చేసుకున్నారని కేవీ రావు ఫిర్యాదు చేశారు. ఈకేసులో విదేశాలకు పారిపోకుండా విజయసాయిరెడ్డికి ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి.
AP CID : ఇప్పటికే ఈడీ విచారణకు హాజరు..
కాకినాడ సీపోర్టు బెదిరింపుల కేసులో ఇప్పటికే విజయసాయిరెడ్డిని ఈడీ ప్రశ్నించింది. తదుపరి ఆయన రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి, పొలం పనులు చేసుకుంటానని వెల్లడించారు. కానీ, ఆయన వచ్చే జూన్, జులైలో భాజపాలో చేరనున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే, ఆయనపై కేసులైతే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ పోర్టు వ్యవహారంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి, ఆస్తులు కాజేశారనే ఆరోపణలను సీఐడీ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. పోర్టు వాటాలను తిరిగి కేవీరావుకు ఇచ్చేసి రాజీ చేసుకున్నట్లుగా ప్రచారంలో ఉంది. కానీ, ఇందులో నిజం ఎంత ఉందో స్పష్టత లేదు. బుధవారం సీఐడీ ఎదుట విజయసాయిరెడ్డి హాజరు అయితే గానీ పూర్తి వివరాలు బయటకు రావు.