అక్షరటుడే, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో బీసీ, ఈబీసీ విద్యార్ధులకు అమలు చేస్తున్న విదేశీ విద్యానిధి పథకానికి సంబంధించి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అక్టోబరు 15వ తేదీతో ఈ గడువు పూర్తి కానుంది.
మహాత్మా జ్యోతిబాఫులే విదేశీ విద్యా పథకానికి సంబంధించి అధికారులు ప్రకటన జారీ చేశారు. అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు కొత్తగా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి సూచించారు.
35 ఏళ్లు మించకూడదు..
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయసు 35 ఏళ్లకు మించకూడదు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలు దాటకూడదు. ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, ప్యూర్ సైన్స్, అగ్రికల్చర్ సైన్స్, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు విదేశీ విద్యానిధి సాయం పొందడానికి అర్హులు అవుతారు.
ఈ దేశాలకు వర్తింపు
విదేశీ యూనివర్శిటీలలో ప్రవేశాల కోసం ఐ 20 ఇన్విటేషన్ ఉన్నవారు, వీసాలు వచ్చినవారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ఉన్నత విద్యకు ఈ పథకం వర్తిస్తుంది.
రూ. 20 లక్షల ఆర్థిక సాయం..!
ఈ పథకానికి ఎంపికైన విద్యార్ధులకు గరిష్టంగా రూ. 20 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు. వీసా ఛార్జీలతో పాటు ఒకవైపు విమాన ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. గ్రాడ్యుయేషన్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు జీఆర్‌ఈ, జీ మ్యాట్ స్కోర్‌లను పరిగణనలోకి తీసుకుంటారు.
అభ్యర్థులు సాధించిన స్కోర్‌కు విదేశీ విద్యానిధి పథకంలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టోఫెల్, ఐఈఎల్టీఎస్, పీటీఈలకు 20 శాతం ఇస్తారు. మెరిట్ లిస్ట్ ఎంపికలో స్కోర్ పరిగణనలోకి తీసుకుంటారు. విదేశాల్లో అడ్మిషన్ పొందే యూనివర్శిటీల్లో స్కోర్ పరిగణనలోకి తీసుకోకపోయినా దరఖాస్తు సమయంలో మాత్రం వాటిని పేర్కొనాల్సి ఉంటుంది.
ఎస్సీ విద్యార్థులకు..
ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. ఉపకార వేతనాల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబరు 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చని వివరించింది.