అక్షరటుడే, ఆర్మూర్: వాటాలు, కమీషన్లు లేకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్మూర్‌కు మంచి రోజులు వస్తున్నాయని, అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఆర్మూర్ ప్రాంత ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అధికంగా ఓట్లువేసి భారీ మెజారిటీ ఇచ్చారన్నారు. మన ప్రాంత అభివృద్ధి కోసం సీఎంతో పాటు నలుగురు మంత్రులను కలిసి చర్చించానని.. నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నందిపేట్‌లో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్, మాక్లూర్‌లో మహిళా కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. సీఎం కొడంగల్‌కు ఎన్ని నిధులు తీసుకెళ్తారో ఆర్మూర్‌కు కూడా అలాగే ఇవ్వాలని కోరానన్నారు. నియోజవర్గంలోని గుంజిలి, కంఠం, మచ్చర్ల, ఫతేపూర్ లిఫ్ట్‌ల ఏర్పాటు త్వరలో జరగనుందని పేర్కొన్నారు. గ్రామసభలు పెట్టి అర్హులందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. ఆర్మూర్ రైల్వే జంక్షన్‌ను డిచ్‌పల్లికి కలపాలని రైల్వే మంత్రిని కోరానని, అధికారులను సర్వేకు పంపుతామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. జక్రాన్‌పల్లిలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు విషయమై కేంద్రమంత్రిని కలిసినట్లు చెప్పారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, పట్టణాధ్యక్షుడు ద్యాగ ఉదయ్, జిల్లా అధికార ప్రతినిధి కలికోట గంగాధర్, నాయకులు పాన్ శ్రీనివాస్, ఆకుల రాజు, జాగిర్దర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.