సస్పెన్షన్ కాదు, డిప్యూటేషన్.. ఎక్సైజ్ శాఖలో విచిత్ర పరిస్థితి!

0

అక్షరటుడే, నిజామాబాద్: ఆర్మూర్ ఎక్సైజ్ స్టేషన్ లో కస్టడీ నుంచి నిందితుడు తప్పించుకున్న ఘటనలో కానిస్టేబుల్ ను విధుల నుంచి తప్పించారు. ఆర్మూర్ ఎక్సైజ్ స్టేషన్ కానిస్టేబుల్ దేవిదాస్ ను యంచ చెక్ పోస్టుకు బదిలీ చేశారు. వారం కిందట ఆర్మూర్ లోని జిరాయిత్ నగర్ కు చెందిన పాత నేరస్థుడు అంజద్ గంజాయి విక్రయిస్తున్నాడనే సమాచారంతో అరెస్టు చేశారు. నాలుగు ప్యాకెట్ల గంజాయి సీజ్ చేశారు. కాగా నిందితుడు కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఆ సమయంలో కానిస్టేబుల్ దేవిదాస్ విధుల్లో ఉన్నారు.

సస్పెన్షన్ కాకుండా అండ!

నిందితుడు పట్టుబడిన సమయంలో గంజాయి సీజ్ చేసినప్పటికీ.. ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. అయితే కానిస్టేబుల్ పైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందనే కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. నిజానికి కస్టడీ నుంచి నిందితుడు పారిపోతే స్థానిక స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి. ఈ విషయంలో కూడా అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. కానిస్టేబుల్ సస్పెన్షన్ కాకుండా స్టేషన్ అధికారి మొదలు పలువురు అండదండలు అందిస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.!