ఆస్తమా.. జాగ్రత్త పడితే మేలు సుమా..

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: ఒక్కో కాలంలో ఒక్కో అనారోగ్య సమస్య వెంబడిస్తుంటాయి. చలికాలంలో ఊపిరితిత్తుల సమస్య ఎక్కువగా ఉంటుంది.. మరీ ముఖ్యంగా ఆస్తమాతో చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఈ వ్యాధిని గుర్తించడం.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఆహార నియమాలు.. వ్యాధి చికిత్స తదితర అంశాలపై ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ తో ‘అక్షరటుడే’ ముఖాముఖి నిర్వహించింది.

ఆస్తమా అంటే ఏమిటి, ఎదురయ్యే సమస్యలు?

ఆస్తమా అనేది వాయునాళాలకు సంబంధించిన వ్యాధి. నాళాలకు వాపు రావడం వల్ల.. జిగురుగా ఉండే పదార్థం (శ్లేష్మం) తయారవుతుంది. దీనివల్ల ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి.

ఇది అంటు వ్యాధా?

కొందరిలో వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. అంటువ్యాధి కాదు.

ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? గుర్తించడం ఎలా?

ప్రధానంగా సాధారణ పనులు, వ్యాయామం చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఛాతి బిగపట్టినట్లు ఉండడం.. విపరీతంగా దగ్గు రావడం, నడిచినా.. మెట్లెక్కినా తొందరగా అలసిపోవడం దీని ప్రధాన లక్షణం. చల్ల గాలి తగిలినప్పుడు ఈ లక్షణాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

వ్యాధిగ్రస్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

ఆస్తమా అనేది దీర్ఘకాలిక వ్యాధి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించి తగు సూచనలు పాటిస్తే నియంత్రించవచ్చు. ముఖ్యంగా పొగ తాగడం మానేయాలి, ఇతరులు పొగ తాగినప్పుడు దూరంగా ఉండాలి. దుమ్ము ధూళి, చల్లని ప్రదేశాల్లో సంచరించొద్దు. పెంపుడు జంతువులకు దూరంగా ఉండడం మంచిది. అవసరమైనప్పుడు ఫిల్టర్ మాస్క్ ధరించాలి. బయటికి వెళ్లి వచ్చిన తర్వాత స్నానం చేయాలి. ప్రధానంగా దుప్పట్లను ఎప్పటికప్పుడు వేడి నీళ్లతో ఉతకాలి.

రోగులు ఎలాంటి ఆహారం తీసుకుంటే మేలు ?

విటమిన్ ‘ఏ’ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా క్యారెట్లు, పాలకూర, చిలగడదుంప, చేప, పాల ఉత్పత్తులు, గుడ్లతో పాటు విటమిన్ ‘డి’ సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. ఇవి ఊపిరితిత్తులను దృఢంగా చేస్తాయి. అలాగే విటమిన్ ‘ఈ’ ఉండే విత్తనాలు, గింజలు, కూరగాయలు తీసుకోవాలి. వీటివల్ల ఊపిరితిత్తుల వాపు రాకుండా ఉంటుంది.

వీరు ఏ పదార్థాలకు దూరంగా ఉండాలి?

మాంసం, చీజ్, ఐస్ క్రీమ్, పాల కొవ్వు వంటి సంతృప్త ఆమ్లాలను నివారించాలి. వీటివల్ల వాపు పెరిగి ఇబ్బందులు కలుగుతాయి. కొబ్బరి నూనె, పామ్ ఆయిల్ తో చేసిన ఆహారంతో ఆస్తమా పెరిగే అవకాశం ఉంటుంది.

ఇన్హేలర్ వాడకంపై చాలా మందిలో అపోహలు ఉంటున్నాయి..

ఇన్హేలర్ వాడితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇది చాలా సురక్షితమైన మందు. ఇది వ్యసనం కాదు.. అలవాటుగా మారదు. ప్రభావం కూడా చూపదు. వైద్యులు సూచించిన మందులతో పాటు ఇన్హేలర్ సరిగ్గా వాడితే ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ప్రధానంగా ఆహార అలవాట్ల మీద ప్రభావం చూపదు. రెండు రకాల ఇన్హేలర్లు ఉంటాయి. మొదటిది మీటర్డ్ డోస్, రెండోది డ్రై పౌడర్. వైద్యులు సూచించిన ఇన్హేలర్ వాడాలి. వీటితోపాటు యోగా చేయడం చాలా మంచిది అని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వివరించారు.

దేశంలో ఇలా..

భారత్‌లో సుమారు 2 కోట్ల మందికి పైగా ప్రజలు ఆస్తమాతో బాధపడుతున్నారు, ఇది జనాభాలో 2% నుంచి 3% వరకు ఉంటుందని అంచనా.

ఆస్తమాకు ప్రధాన కారణాలు

పొగ, దుమ్ము, రసాయనాలు, పుష్పాల ధూళి వంటి కారకాలు ఆస్తమాను ప్రేరేపిస్తాయి.

పర్యావరణ కాలుష్యం: ముఖ్యంగా పట్టణాల్లో గాలి కాలుష్యం, వాహనాల పొగలు, పరిశ్రమల నుంచి విడుదలయ్యే రసాయనాలు ప్రధాన కారణాలు.

వాతావరణ పరిస్థితులు: జలవాయువుల్లో మార్పులు, ముఖ్యంగా చల్లటి, పొడి గాలులు ఆస్తమా దాడులకు కారణమవుతాయి.

గృహ కాలుష్యం: ఇంట్లో పొగ (వంట కాలుష్యం), దుమ్ము, పుష్పాల ధూళి వంటి కారణాలు.