అక్షరటుడే, వెబ్‌డెస్క్ ATM Charges : ఇప్పుడంతా డిజిటల్ యుగం నడుస్తోంది. చాలా మంది ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు, (Online Transactions) డిజిటల్ పేమెంట్లపై (Digital Payments) ఆధార పడుతున్నారు. అయితే అవి ఎంత పెరిగినా క్యాష్ ఇప్పటికీ అవసరమే. చాలా మంది ఇప్పటికీ నగదు లావాదేవీలపై ఆధారపడుతున్న నేపథ్యంలో ఏటీఎంలలో క్యాష్ విత్‌డ్రా చేస్తున్నారు.
అయితే ఇకపై ఏటీఎంలో డబ్బు డ్రా చేయడం ఫ్రీ కాదు. తప్పక ఛార్జీలు చెల్లించాల్సిందే. త్వరలో (Reserve Bank of India) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI , నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI కీలక మార్పులు తీసుకురానుంది. ఏటీఎంలో నగదు ఉపసంహరణ, బ్యాలన్స్ చెక్ లావాదేవీలపై ఛార్జీలు మే 1 నుంచి పెంచనుంది.
ఖాతా ఉన్న హోం బ్యాంక్ నెట్‌వర్క్ (Home Bank Network) ఏటీఎం ATM నుంచి కాకుండా ఇతర బ్యాంక్ నెట్‌వర్క్‌లోని ఏటీఎం నుంచి లావాదేవీలను జరిపే వారిపై ఈ భారం పడనుంది. ఇతర బ్యాంకుల ఏటీఎం(ATM)ల ద్వారా మెట్రో నగరాల్లో నెలకు 5 లావాదేవీలు, నాన్ మెట్రో ప్రాంతాల్లో నెలకు మూడు లావాదేవీలు ఉచితంగా జరుపుకోవచ్చు. ఈ పరిమితి దాటిన తర్వాత జరిపే ప్రతి లావాదేవీపైనా అదనపు భారం పడనుంది. నగదు ఉపసంహరణ రుసుము ప్రతి లావాదేవీకి రూ.17 నుంచి రూ.19కి పెరుగనుంది. బ్యాలన్స్ ఎంక్వైరీ ఫీజు ప్రతి లావాదేవీకి రూ.6 నుంచి రూ.7కు పెరుగుతుంది. నిర్వహణ వ్యయాలు పెరుగుతున్నందు వల్ల ఈ రుసుములను పెంచాలని వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు చాలా కాలం నుంచి కోరుతున్నారు.
ఈ ప్రతిపాదనను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI ఆమోదించగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI కూడా ఆమోదం తెలిపింది. దీంతో కొత్త చార్జీలు మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి ప్రభావం చిన్న బ్యాంకులపై పడే అవకాశం ఉంది. ఆ బ్యాంకులకు తక్కువ ఏటీఎంలు ఉండడంతో, వాటి ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఎక్కువగా ఉపయోగిస్తుండడం జరుగుతుంది. దీంతో వారు ఎక్కువ ఛార్జీలు చెల్లించే పరిస్థితి ఉంటుంది.
అలాగే తరచుగా ఏటీఎం వినియోగించే వారు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇలా నగదు లావాదేవీలకు చెల్లించే ఛార్జీలు పెరగడంతో ప్రజలు డిజిటల్ లావాదేవీల వైపు మరింతగా మొగ్గు చూపే అవకాశముంది. గత రెండు సంవత్సరాల్లో ముఖ్యంగా గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లో ఏటీఎంల నిర్వహణ ఖర్చు పెరగడం, ద్రవ్యోల్బణం ప్రభావంతో దాదాపు అన్ని ధరలు పెరుగుతున్నాయి. అలానే ATMలలో క్యాష్ రీఫిల్ చేయడానికి కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి.