అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: అమాయకులను ఆసరాగా చేసుకుని ఏటీఎం మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా జంగంపల్లికి చెందిన రమేశ్ నిజామాబాద్ నగరంలో వరుసగా ఏటీఎం మోసాలకు పాల్పడుతున్నాడు. ఎలాంటి అవగాహనలేకుండా ఏటీఎంలో డబ్బుల కోసం వెళ్ళిన వారిని గుర్తించి డబ్బులు డ్రా చేసిస్తానని నమ్మించేవాడు. వారి నుంచి ఏటీఎం కార్డు తీసుకుని దానిని మార్చేసి మరో ఏటీఎం ఇచ్చేవాడు. వారు వెళ్లిపోగానే మార్చేసిన ఏటీఎం కార్డుతో డబ్బులు డ్రా చేసుకుని ఉడాయిస్తాడు. ఇలా నగరంలో మూడుచోట్ల మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడి నుంచి డమ్మీ ఏటీఎం కార్డులు, నగదు సీజ్ చేశారు. మంగళవారం అరెస్టు చేసి రిమాండుకి తరలించినట్లు ఒకటో టౌన్ ఎస్ హెచ్ వో విజయ్ బాబు తెలిపారు.