అక్షరటుడే, ఇందూరు: Rajiv Yuva Vikasam Scheme | జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకంపై యువతకు అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. ఈ పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
పథకానికి వీలైనంత ఎక్కువమంది నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఇప్పటికే ఆయా శాఖల ద్వారా పత్రికా ప్రకటనలు విడుదల చేసి విస్తృత ప్రచారం కల్పించామన్నారు.
Rajiv Yuva Vikasam Scheme | తహశీల్దార్లను ఆదేశించాం..
ఈ పథకానికి దరఖాస్తులు చేసుకునే వారికి ఇబ్బంది కలుగకుండా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను వెనువెంటనే జారీ చేయాలని అన్ని మండలాల తహశీల్దార్లను ఆదేశించామన్నారు. అన్ని మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ పథకం ప్రాధాన్యతను, అమలు తీరులో చేపట్టాల్సిన చర్యల గురించి మార్గనిర్దేశం చేస్తామని తెలిపారు.
లబ్ధిదారులను ఎంపిక చేసేలా మున్సిపల్, మండల స్థాయిలలో సంబంధిత అధికారులతో ఎంపిక కమిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల వివరాల గురించి కలెక్టర్ తెలిపారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, డీబీసీడీవో స్రవంతి, డీటీడబ్ల్యువో నాగూరావు, లీడ్ బ్యాంకు మేనేజర్ అశోక్ చౌహన్ తదితరులు పాల్గొన్నారు.