అక్షరటుడే, ఆర్మూర్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని.. కానీ ఇప్పటికీ ఎందుకు అమలు చేయడంలేదని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వకపోవడం సరికాదన్నారు. భీమ్‌గల్ మండలంలో సోమవారం 136 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు హామీ ఇవ్వడంతో నిరుపేదలు అప్పు చేసి తమ బిడ్డలకు తులం బంగారం సైతం కొనుగోలు చేసి ఇచ్చారన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం లబ్ధిదారులకు కేవలం రూ.లక్ష చెక్కులే ఇస్తుండడంతో వారు నిరాశకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు తులం బంగారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.