అక్షరటుడే, ఆర్మూర్: ఎస్సారెస్పీ ద్వారా ఆయకట్టుకు నీటి విడుదల మొదలైంది. బుధవారం ఉదయం బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి గేట్లను ఎత్తి నీటి విడుదల ప్రారంభించారు. కాకతీయ, లక్ష్మి కాల్వల ద్వారా నీటిని దిగువకు వదిలారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కాల్వల ద్వారా 15 రోజుల క్రితమే నీటిని విడుదల చేయాల్సి ఉన్నా.. కావాలనే ప్రభుత్వం ఆలస్యం చేసిందని ఆరోపించారు. రైతులకు నీళ్లిచ్చే విషయంలో రాజకీయాలు తగదని వ్యాఖ్యానించారు. రాజకీయాలు పార్టీల మధ్యే ఉండాలని.. అన్నదాతల విషయంలో వద్దని హితవు పలికారు. దీనివల్ల రైతన్నలు నష్టపోతారన్నారు. ఎస్సారెస్పీలో నీళ్లు వచ్చాయని.. గుత్ప, అలీసాగర్‌లను కూడా నడపాలని పేర్కొన్నారు. చెరువులను నింపాలని విజ్ఞప్తి చేశారు.