అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BJP | సొంత పార్టీపై నేతలపై ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) ఇంటికి కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) వెళ్లనున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న రాజాసింగ్ ఇటీవల పలు వ్యాఖ్యలు చేశారు. పార్టీలో నుంచి కొందరు వెళ్లిపోతేనే అధికారంలోకి వస్తుందన్నారు. అంతేగాకుండా రాష్ట్ర అధ్యక్ష పదవి సైతం మంచి వ్యక్తికి ఇవ్వాలన్నారు.
రాష్ట్ర నాయకులు చెప్పిన వారికి ఇస్తే రబ్బర్ స్టాంప్‌గా మారుతారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో రహస్యంగా సమావేశాలు నిర్వహించని వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. ఇటీవల శ్రీరామ నవమి (Sri Ram Navami) శోభాయాత్ర సందర్భంగా కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను నిర్వహించే శోభాయాత్రకు ప్రజలు రాకుండా పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని, అందుకే అంబర్‌పేటలో మరో యాత్ర చేపట్టారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం రాజాసింగ్ ఇంటికి వెళ్లి బండి సంజయ్ భేటీ కానున్నారు. నాయకత్వంపై అసంతృప్తిలో ఉన్న ఆయనను బండి బుజ్జగించనున్నారు. అలాగే ఆకాశ్‌పురి హనుమాన్ ఆలయం దగ్గర జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగా ఇటీవల బండి సంజయ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పొగిడిన విషయం తెలిసిందే. ఆయనకు సాటి ఎవరు లేరని, హిందూ ధర్మానికి ఆదర్శమైన వ్యక్తి రాజాసింగ్ అని బండి ఇటీవల వ్యాఖ్యానించారు.