అక్షరటుడే, బాన్సువాడ: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నాడనే పక్కా సమాచారం మేరకు సీఐ కృష్ణ ఆధ్వర్యంలో కొయ్యగుట్టలో తనిఖీలు నిర్వహించారు. సీమల శ్రీకాంత్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బోధన్ పట్టణంలోని రాకాసిపేటకు చెందిన నస్రిన్ బేగం అలియాస్ సుమేరాబాను వద్ద తాను గంజాయి కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం బోధన్ పట్టణంలోని నస్రిన్ బేగం ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 500 గ్రాముల గంజాయి దొరికింది. నస్రీన్ తో పాటు ఆమె మామ రషీద్ ను అదుపులోకి తీసుకొని విచారించగా మహారాష్ట్రలోని నాయగావ్ నుంచి గంజాయిని కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నారు. శ్రీకాంత్, నస్రిన్ బేగం, రషీద్ ను సోమవారం అరెస్టు చేశారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీఐ కృష్ణ, సిబ్బందిని ఎస్పీ సింధుశర్మ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.