అక్షరటుడే, వెబ్‌డెస్క్: బతుకమ్మ అనేది రాష్ట్రంలో ఘనంగా జరుపుకొనే పూల పండుగ. ఇది తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలో ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం దసరా ముందు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను జరుపుతారు. ముఖ్యంగా స్త్రీ శక్తిగా.. మహిళలు జరుపుకొనే వేడుకగా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రకృతి పట్ల కృతజ్ఞతగా నిర్వహించుకునే సంబరం. ఈ వేడుకలు మహాలయ అమావాస్య నాడు ప్రారంభమై ఆశ్వయుజ అష్టమి నాడు ముగుస్తాయి.
పూలతో అలంకరించడం
బతుకమ్మ అనేది వివిధ రంగుల పూలతో తయారు చేసిన పుష్పాల రూపకల్పన. వివిధ రకాల పువ్వులు (తంగేడు, గన్నేరు, చమంతి మొదలైనవి) ఉపయోగించి బతుకమ్మను అందంగా అలంకరిస్తారు.
ఆరాధన
బతుకమ్మను ఒక చెరువు దగ్గర ఉంచి, పూజలు చేసి, ఆ తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇది ప్రకృతికి, అది అందించిన వనరులకు కృతజ్ఞత చెప్పే చిహ్నంగా భావిస్తారు.

సంప్రదాయం
బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో ఉత్సాహంతో జరుపుకొంటారు. వీరు బతుకమ్మ చుట్టూ చేరి పాటలు పాడతారు. నృత్యాలు చేస్తారు. బతుకమ్మ పాటలు ప్రధానంగా తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.
సాంఘిక విలువలు
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్త్రీలు అందరూ కలిసి ఈ పండగ నిర్వహించుకోవడం వల్ల వారి మధ్య సాంఘిక బంధాలను మరింత బలపరుస్తుంది.

చరిత్ర…
క్రీస్తు శకం 1006లో చోళులు వేములవాడలో ఉన్న శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించిన ఘటన స్థానిక ప్రజల మనసు కలచివేసింది. బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు ఇక్కడివారు. అలా ఏటా బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు.
రోజుకో ప్రత్యేక నైవేద్యం..
- మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ.. ఇదే రోజున పెత్రమాస అని కూడా అంటారు. ఈ రోజున నువ్వులను బియ్యం పిండి లేదా తడి బియ్యంతో నైవేద్యంగా సమర్పిస్తారు.
- రెండో రోజు అటుకుల బతుకమ్మ… పాడ్యమినాడు అటుకుల బతుకమ్మ నిర్వహిస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు.
- మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ.. విదియ రోజున బతుకమ్మకు ముద్దపప్పు, పాలు, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు.
- నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ.. ఈ రోజున నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు.
- ఐదో రోజు అట్ల బతుకమ్మ.. ఈ రోజున గోధుమ అట్లు లేదా బియ్యం పిండి అట్లు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
- ఆరో రోజు అలిగిన బతుకమ్మ.. పంచమి రోజు అమ్మవారు అలకబూనుతుంది. కాబట్టి ఈరోజు బతుకమ్మను పేర్చరు.
- ఏడో రోజు వేపకాయల బతుకమ్మ.. ఈ రోజున సకినాల పిండితో వేప పండు ఆకారంలో వంటలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.
- ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ.. ఈరోజు నువ్వులు, వెన్న నైవేద్యంగా సమర్పిస్తారు.
- చివరి రోజు.. సద్దుల బతుకమ్మ.. దుర్గాష్టమి నాడు తొమ్మిదో రోజు బతుకమ్మ వేడుక నిర్వహిస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వల సద్ది వంటకాలు తయారు చేసి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.

content writer : నరేశ్ చందన్