
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Betting Apps Promotion | ప్రస్తుతం తెలంగాణ, ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన అంశం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు, టీవీ నటులు, ఇతర సెలబ్రిటీలు చాలామంది బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసి కోట్లల్లో సంపాదించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 11 మంది ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారన్న కారణంతో వాళ్లపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
.
ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ హర్షసాయి, పరేషన్ బాయ్స్ ఫేమ్, యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్, ఫుడ్ రివ్యూయర్, యూట్యూబర్ టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్, టీవీ నటి, యాంకర్ విష్ణుప్రియ, ప్రముఖ టీవీ యాంకర్ శ్యామల, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ రీతూ చౌదరి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ సుప్రీత, యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అజయ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ సందీప్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన వారిలో ఉన్నారు. అలాగే మరికొంత మంది పైనా కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Betting Apps Promotion : వెలుగులోకి తెచ్చిన తెలంగాణ ఆర్టీసీ ఎండీ
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ #SayNoToBettingApps అనే క్యాంపెయిన్ ను ట్విట్టర్ లో స్టార్ట్ చేశాక.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై అందరి కన్ను పడింది. వైజాగ్ కు చెందిన యూట్యూబర్ నానిని కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నా అన్వేషణ అనే యూట్యూబ్ చానెల్ నిర్వహించే అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్లందరి గురించి తన యూట్యూబ్ చానెల్ లో మాట్లాడటంతో వాళ్లపై కేసులు నమోదయ్యాయి.
ఇప్పటికే టేస్టీ తేజ, విష్ణుప్రియలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మిగితా వారికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్‌లను తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రమోట్ చేసి వీళ్లంతా కోట్లలో డబ్బులు సంపాదించారని యూట్యూబర్ అన్వేష్ ఆరోపిస్తున్నారు. అయితే, ప్రతి వ్యక్తి కచ్చితంగా బెట్టింగ్ యాప్స్ మీద ఎంత సంపాదించారు? ఏ యాప్స్ ను వాళ్లు ప్రమోట్ చేశారు? అనే దానిపై స్పష్టత అయితే లేదు.
ఈ యాప్స్ ద్వారా యువతను ఆకర్షించి, వారిని బెట్టింగ్ లో పాల్గొనేలా ప్రేరేపించేలా వీడియోలు తీయడం, తమకు ఈ గేమ్స్ ఆడటం వల్ల చాలా డబ్బులు వచ్చాయని నమ్మబలకడం లాంటివి చేసి యువత తప్పుడు మార్గంలో వెళ్లేలా ఇన్‌ఫ్లూయెన్స్ చేసినట్టుగా రుజువు కావడంతో వీళ్లందరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వీళ్లను మాత్రం వదిలేది లేదు. అందరినీ జైలులో వేయాల్సిందే.. అప్పుడే వీళ్లకు బుద్ధి వస్తుంది. ఇకనైనా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌ను ఇతర యూట్యూబర్లు, సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఆపేయాలని నెటిజన్లు, ప్రజలు కోరుతున్నారు.