
అక్షరటుడే, వెబ్‌డెస్క్ Bhadrachalam : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలకి సిద్ధం అవుతుంది. మార్చి 30 నుండి ఏప్రిల్ 12 వరకు శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భద్రాచలంలో శ్రీరామనవమి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు సెక్టార్ టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించనున్నట్లు ఈవో ప్రకటించారు. ఏప్రిల్ 6న శ్రీరామనవమి వార్షిక కళ్యాణాన్ని మిథిలా మండపం ప్రాంగణంలో కూర్చుని నేరుగా వీక్షించేందుకు ఈ సెక్టార్ టికెట్లను కొనాల్సి ఉంటుందని చెప్పారు.
Bhadrachalam : భక్తులు ఆగ్రహం..
అయితే బ్రహ్మోత్సవాలకి అంతా సిద్ధం అవుతున్న సమయంలో ఆలయంలో ఘోరమైన అపచారం జరిగింది. భద్రాచలం రాములోరి సన్నిధిలో జరిగిన అపచారం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్యాకెట్లలో పురుగులు పట్టిన తలంబ్రాలు పోస్తూ ఉండగా, అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. రూ. లక్షల విలువైన ముత్యాల తలంబ్రాలు నేలపాలు చేయడం పట్ల అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాములోరి సన్నిధిలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం
బయటపడింది అంటున్నారు. మరీ ఇంత నిర్లక్ష్యమా అంటూ భక్తులు మండిపడుతున్నారు.
ప్రతీ ఏటా కన్నులపండువగా సాగే ఈ మహోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామి వారి కళ్యాణ తలంబ్రాలను భక్తులకు అందిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ తలంబ్రాలను ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు భక్తులు. అలాంటి స్వామివారి కళ్యాణ తలంబ్రాలు… నేలపాలు కావడం బాధిస్తుంది.. భద్రాద్రి సీతారామచంద్రస్వామి తలంబ్రాల పంపిణిలో అధికారులు వ్యవహరించిన తీరుతో కొన్ని క్వింటాళ్ల తలంబ్రాలు పురుగు పట్టాయి. దీంతో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గతంలోను ఇలానే 20 క్వింటాళ్ల తలంబ్రాలు పురుగు పెట్టినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.