Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్: తెలంగాణ సాధన కోసం మాజీ సీఎం కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ దీక్ష చారిత్రక ఘట్టమని బీఆర్‌ఎస్‌ భైంసా నియోజకవర్గ సమన్వయకర్తలు విలాస్‌ గాదేవార్, కిరణ్‌ కొమ్రేవార్‌ అన్నారు. ఈమేరకు ఈనెల 29న నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే దీక్షా దివస్‌కు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముథోల్‌ నియోజకవర్గంలో పల్సి, బెల్‌తరోడా కొత్త మండలాలను ప్రకటించదని, కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 32 కొత్త మండలాల జాబితాలో వీటి ప్రస్తావన లేకపోవడం శోచనీయమన్నారు. ఇక్కడి అధికార ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జీలు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధిపై వారికి చిత్తశుద్ధి లేదని ప్రజలకు అర్థమవుతోందన్నారు. విలాస్‌ గాదేవార్‌ మాట్లాడుతూ.. భైంసాను మహిషాగా మారుస్తామని భగవద్గీతపై ప్రమాణం చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే అభివృద్ధిని విస్మరించారని, కాంగ్రెస్, బీజేపీ కారణంగా ముధోల్‌ నియోజకవర్గ అభివృద్ధిలో వెనుబడుతోందన్నారు. రానున్న రోజుల్లో రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు, తదితరులున్నారు.

Advertisement