అక్షరటుడే, హైదరాబాద్:Bhu Bharati portal : తెలంగాణ రాష్ట్రంలో నేటి (ఏప్రిల్ 14న) భూ భారతి పోర్టల్ bhu bhaarati portal అందుబాటులోకి రాబోతుంది. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం, రైతులు, ప్రజలకు మరింత సులభతరంగా, వేగంగా అందుబాటులో ఉండేలా ఈ భూ భారతి పోర్టల్ ను ప్రభుత్వం సరికొత్తగా తీర్చిదిద్దింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఈరోజు సాయంత్రం 5 గంటలకు భూ భారతి పోర్టల్ ను ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసి, సదరు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూ భారతిపై అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయా సదస్సుల్లో ప్రజల నుంచి సందేహాలు, సలహాలు, సూచనలను స్వీకరించే అవకాశం ఉంది.
కలెక్టర్లతోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. భూ భారతి పోర్టల్, ఇందిరమ్మ ఇళ్ల(Indiramma houses)పై ప్రధానంగా సమీక్షించే అవకాశం ఉంది. ఈ పథకాలపై అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కలెక్టర్లను ఆదేశించనున్నారు. దీంతో పాటు తాగునీటి పథకాలపై కూడా చర్చించనున్నారు.