అక్షరటుడే, ఇందూరు: కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కమీషన్ల కోసం ఆరాటపడుతుందే తప్ప చిత్తశుద్ధితో పనిచేయడం లేదని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో స్టేడియం నిర్మాణం కోసం అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ఇన్ ఛార్జి మంత్రి జూపల్లి, సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుంచి అనేకసార్లు స్టేడియం కోసం వినతిపత్రాలు ఇచ్చారన్నారు. అలాగే గతంలో క్రీడాకారులు, క్రీడా సంఘాలకు మద్దతు పలికి పోరాటం చేశారన్నారు. షబ్బీర్ అలీ ఈ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. రెవెన్యూ కార్యాలయ స్థలం వద్ద కాంగ్రెస్ భవన్ నిర్మాణానికి కూడా పావులు కదుపుతున్నారని పేర్కొన్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని హితవు పలికారు. సమావేశంలో బీజేపీ నాయకులు నాగోల్ల లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, కార్తీక్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.