అక్షరటుడే, ఆర్మూర్‌: రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ ప్రభుత్వం నుడాను విస్తరించాలని భావిస్తోందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్‌ ఆరోపించారు. మంగళవారం పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నుడా పరిధిలో ఇప్పటికే 73 గ్రామాలుండగా, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్‌ మున్సిపాలిటీలతో పాటు 380 గ్రామ పంచాయతీలను సైతం దీని పరిధిలోకి తెచ్చేందుకు చూస్తున్నారన్నారు. నుడా విస్తరణతో ఆయా గ్రామాల్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్‌ మున్సిపాలిటీలతో డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పట్టణ ప్రధాన కార్యదర్శి వేణు, ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌ పాల్గొన్నారు.