అక్షరటుడే, న్యూఢిల్లీ: డిల్లీ అసెంబ్లీ పీఠాన్ని భాజపా కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవ లేకపోయింది. దేశంలోనే సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ.. దేశ రాజధానిలో ముచ్చటగా మూడోసారి ఓటమిపాలైంది. ఒకప్పుడు వరుస విజయాలతో ఢిల్లీ పీఠంపై కూర్చుంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తింది.
ఆప్ నకు మళ్లిన ఓటు బ్యాంకు
ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, నాటి వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన అవినీతి, లంచగొండితనాన్ని భరించలేకపోయిన స్థానిక ప్రజలకు ఆప్ ఒక ఆశాకిరణంగా కనిపించింది. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఉన్న ఓటు బ్యాంకు ఆప్ వైపు మళ్లింది. దీంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 8 స్థానాలే వచ్చాయి. 2015 ఎన్నికల్లో ఆ సీట్లు కూడా కోల్పోయింది. 2015, 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు పూర్తిగా ఆప్ చేతిలోకి వెళ్లిపోయింది.
బలమైన నాయకత్వం ఎక్కడ..
ఢిల్లీలో షీలా దీక్షిత్ నాయకత్వంలో కాంగ్రెస్ 15 ఏళ్ల పాటు పాలన చేసింది. ఆమె తర్వాత స్థానికంగా పార్టీని నడిపించే సరైన నాయకత్వం లేకుండా పోయింది. బలమైన నాయకత్వం లేకపోవడంతో వ్యవస్థాగతంగా ఢిల్లీలో పార్టీ బలోపేతం కాలేకపోతోంది.
ఆకర్షించని హామీలు..
పార్టీ అధిష్ఠానంతో సహా ఆయా రాష్ట్రాల పార్టీ ముఖ్యమంత్రులు ప్రచారం చేశారు. మహిళలకు రూ.2,500, 25 లక్షల ఆరోగ్యబీమా ఇస్తామని తాజా మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అధి నాయకులు, వారు గుప్పించిన వరాలు.. ఇవేవీ ఓటర్లను పెద్దగా ఆకర్షించలేదు. వీరి హామీలను తెలంగాణ ప్రజలు నమ్మినట్లు.. ఢిల్లీ ఓటర్లు విశ్వసించలేదు. ప్రధాని మోదీ ఛరిష్మా బాగా పని చేసింది.