అక్షరటుడే, ఇందూరు: సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ప్రచారాలను సమర్థంగా తిప్పి కొట్టాలని ఎంపీ అరవింద్ ధర్మపురి ఐటీ సెల్ నాయకులకు సూచించారు. నగరంలోని వినాయక్ నగర్ మున్నూరుకాపు సంఘంలో బుధవారం ఐటీ సెల్ ఆధ్వర్యంలో శంఖనాథ్ పేరిట సోషల్ మీడియా వారియర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కొందరు దొంగదారిలో వచ్చి ఇబ్బందులకు గురి చేస్తారని, అటువంటి వారిపట్ల అప్రమత్తత అవసరమన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందన్నారు. ఎన్నికల్లో పనిచేసేందుకు 180 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రిజిస్టర్ చేసుకోవడం సంతోషకరమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ను ధీటుగా ఎదుర్కొన్నామని, పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువగా కష్టపడే అవసరం లేదన్నారు. కానీ, ఇలాంటి సమయంలోనే జాగ్రత్త అవసరమని.. ఎన్నికల ప్రచారంలో ఐటీ సెల్ ది కీలక పాత్ర అని గుర్తు చేశారు. అనంతరం గోవా బీజేపీ అధికార ప్రతినిధి గిరిరాజ్ పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆశిష్, చిరంజీవి, బంటు రాము, పంచరెడ్డి శ్రీధర్ ఇతర నాయకులు పాల్గొన్నారు.