అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెలంగాణలో ఇండియన్‌ ఇన్ స్టిట్యూట్ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీని స్థాపించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి కోరారు. ఈ మేరకు గురువారం ఎంపీ అర్వింద్‌తో కలిసి కేంద్ర జౌళి, టెక్స్‌టైల్‌ శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిసి విన్నవించారు. ఇక్కత్‌ డిజైన్లకు తెలంగాణ ప్రసిద్ధి అని, ప్రింటెడ్‌ చీరలతో చేనేత కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని వివరించారు. సాంస్కృతిక వారసత్వం కాపాడుకోవడంతో పాటు నేతన్నలకు భరోసా కల్పించేలా ప్రింటెడ్‌ చీరల ఉత్పత్తి, విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని.. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయాలని కోరారు. ఇక్కత్, గద్వాల్‌ చీరలు, వరంగల్‌ దుర్రీలను ఉత్పత్తి చేసే కళ తెలంగాణ నేతన్నల సొంతమని, ఈ మేరకు రాష్ట్రంలో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని విన్నవించారు. అనంతరం పోచంపల్లి శాలువాతో ఆయనను సన్మానించారు. తెలంగాణ వచ్చినప్పుడు తప్పకుండా పోచంపల్లిని సందర్శిస్తానని, వినతులపై తగు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.