అక్షరటుడే, ఇందూరు: జిల్లాలో ఉన్న సారంగాపూర్ చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలని భారతీయ కిసాన్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో రైతు మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించాలని లేదా సహకార చట్టాన్ని గౌరవించి రైతు పాలకవర్గానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ నిబంధనల వల్ల రైతులు నష్టపోతున్నారని, తక్షణమే ఇలాంటి నిబంధన లేకుండా మాఫీ చేయాలన్నారు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించినా.. ఇప్పటివరకు పురోగతి లేదన్నారు. వెంటనే స్పందించి పసుపు బోర్డును ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. అనంతరం భారతీయ కిసాన్ సంఘ్ నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అఖిలభారత కార్యదర్శి సాయిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆనందరావు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
మహాసభ అనంతరం బీకేఎస్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సాయిరెడ్డి, ఉపాధ్యక్షులుగా సూర్యరెడ్డి, కరుణ రెడ్డి, కార్యదర్శిగా రాజన్న, సహ కారదర్శులుగా దినేష్, శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారిగా భూమారెడ్డి, యువ ప్రముఖ్ గా సాయినాథ్ రెడ్డి, సేంద్రియ ప్రముఖ్ గా పాపారావు, చెరుకు ప్రముఖ్ గా లక్ష్మారెడ్డి, రెవెన్యూ ప్రముఖ్ గా వెంకట్ రెడ్డి, విద్యుత్ ప్రముఖ్ గా లక్ష్మారెడ్డి, కార్యవర్గ సభ్యులుగా వినయ్ కుమార్, సంతోష్, బాలన్న, కె.నారాయణరెడ్డి ఎన్నికయ్యారు.