అక్షరటుడే, బోధన్ : Bodhan | బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సమస్యలకు నిలయంగా మారింది. ఆస్పత్రికి వెళ్తే తమకు సరైన వైద్యం అందే పరిస్థితి ఏమాత్రం లేదని రోగులు వాపోతున్నారు. చిన్న చిన్న చికిత్సలు సైతం ఆస్పత్రి వైద్యులు చేయడం లేదని.. కేవలం రిఫర్ చేయడానికి మాత్రమే ఆస్పత్రి పనిచేస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు.
Bodhan | చికిత్స మరిచి.. రిఫర్ చేస్తూ..
సోమవారం ఉదయం బోధన్ పట్టణానికి చెందిన స్రవంతి పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చింది. ఈ సందర్భంగా గర్భిణి కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. ఆస్పత్రికి రాగానే గర్భిణిని పరీక్షించిన వైద్యులు బీపీ నార్మల్‌గా ఉందని చెప్పారన్నారు. అనంతరం ఆమెను ప్రసూతి వార్డ్‌కు తీసుకెళ్లిన అనంతరం మరోసారి బీపీ చూడగా కొద్దిగా ఎక్కువ వచ్చిందని.. దీంతో అక్కడ విధుల్లో ఉన్న గైనకాలజిస్ట్లు నిజామాబాద్‌కు రిఫర్ చేశారని బాధితులు వాపోయారు. ఆస్పత్రిలో ఉండే జనరల్ సర్జన్ సలహా తీసుకోకుండానే వారు వెంటనే జీజీహెచ్‌కు రిఫర్ చేయడంపై వారు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bodhan | చిన్నచిన్న సమస్యలకు సైతం..
అలాగే చిన్నచిన్న సమస్యలకు సైతం నిజామాబాద్ జీజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నారని రోగులు వాపోతున్నారు. ప్రతినెలా ఖచ్చితంగా 30 గైనిక్ కేసులను నిజామాబాద్‌కు రిఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై సూపరింటెండెంట్‌తో సంప్రదించగా.. గైనకాలజిస్ట్‌లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.